పంచాయతీలలో కార్మికుల భర్తీకి కసరత్తు

 ఏడాది క్రితం ప్రతీ పంచాయతీకో కార్యదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతీ పంచాయతీకో పారిశుధ్య కార్మికుడిని నియమించాలని నిర్ణయించింది. పల్లెలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో కార్మికులు తప్పనిసరని భావిస్తోంది. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల పనిని దగ్గరుండి పరిశీలించిన సర్కారు.. కార్మికుల భర్తీకి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారిని అన్ని రకాల పనులకు వినియోగిచడంతోపాటు జీతం కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు.


కాగా, కార్మికులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమించుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీల వివరాలను కార్యదర్శుల నుంచి సేకరిస్తున్నారు. ఏ పంచాయతీకి ఎంత మంది కావాలి.. ప్రస్తుతం ఉన్న వారి సంఖ్యతోపాటు ఆసక్తిగా ఉన్న వారి వివరాలను పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తగా చేరే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పుల్‌టైం వర్కర్లకు నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వాలని అధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో (జీవో 51) స్పష్టం చేసింది.